సీఎం కేసీఆర్‌ను కలిసిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు

Chhatrapati Shivaji descendant Sambhajiraje calls on KCR. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీరాజే

By అంజి  Published on  27 Jan 2023 6:01 AM GMT
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు

మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీరాజే గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకారం.. కొల్హాపూర్ సంస్థానానికి వారసుడు, స్వరాజ్ ఉద్యమ కార్యకర్త సాహు మహారాజ్ మనవడు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ప్రగతి భవన్‌లో శంభాజీరాజేకు కేసీఆర్‌ శాలువా, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి శంభాజీరాజేకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు.

తక్కువ సమయంలోనే తెలంగాణ సాధించిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి శంభాజీరాజే అడిగి తెలుసుకున్నారు. తక్కువ సమయంలోనే దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ విధానాలను తెలుసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని శంభాజీరాజే ఆకాంక్షించారు.

‘అద్భుతమైన’ తెలంగాణ అభివృద్ధి నమూనా ఇక్కడికే పరిమితం కాకుండా మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్, శంభాజీరాజే సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల అభివృద్ధి, దేశ సమగ్రత కోసం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వినూత్న ఎజెండా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు.

సందర్భాన్ని బట్టి మరోసారి సమావేశమై అవసరమైతే అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శంభాజీరాజే పూర్వీకులు శివాజీ మహరాజ్‌ నుంచి సాహు మహరాజ్‌ వరకు దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్‌, శంభాజీరాజే గుర్తు చేసుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా తమ పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వారి స్ఫూర్తితోనే తెలంగాణలో కుల, మత వివక్ష లేకుండా ప్రజా పాలన కొనసాగుతోందని ఈ సందర్భంగా చర్చలో కేసీఆర్ తెలిపారు. మరోవైపు 'రాజర్షి సాహూ ఛత్రపతి' పుస్తకాన్ని కేసీఆర్ కు శంభాజీ అందించారు.


Next Story