రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం సమయంలో మార్పులు
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 6:23 AM GMTరేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం సమయంలో మార్పులు
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే.. ఆయన రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగా.. అందులో కొన్ని మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం గురువారం ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఆయన రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కానీ తాజాగా ఆ సమయంలో స్వల్ప మార్పులు చేశారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. ప్రమాణస్వీకార వేదికలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఎల్బీ స్టేడియంలోనే రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మరోవైపు ఎల్బీస్టేడియంలో నూతన సీఎం ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు స్పీడ్‌గా జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ, పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సీఎంగా రేవంంత్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలను అంతా విడివిడిగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. మాజీసీఎం కేసీఆర్‌కు కూడా రేవంత్‌రెడ్డి ఆహ్వానం పంపనున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్‌తో పాటు చంద్రబాబు, సినీ నటులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు వివిధ సంఘాల నేతలు, మేధావులకు ఆహ్వానం పంపనున్నారు.
మరోవైపు సీఎంగా ఎంపిక అయ్యిన తర్వాత రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం పిలుపుతోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన్ని సీఎంగా ఎంపిక చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో రాష్ట్ర కేబినెట్ కూర్పుపై చర్చించనున్నారు. కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు..? వారికి ఈ శాఖ కేటాయిస్తారనే దానిపై ఈ రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.