విజయవాడ ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ మహిళ అరెస్ట్

విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిచ్చిన సమాచారం మేరకు...

By -  అంజి
Published on : 25 March 2026 12:25 PM IST

Sayeeda Begum Arrest, Chanchalguda Jihadi Activities, Vijayawada Terror Suspects, AQIS and ISIS India, Mohammad Rehmatulla Sharif, BENX COM Group, Foreign Terror Handlers, Terror Network Disrupted

విజయవాడ ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ మహిళ అరెస్ట్

విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, జిహాదీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమెపై నిఘా ఉంచాయి. మంగళవారం విజయవాడ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి ఆమెను తదుపరి విచారణ కోసం తరలించారు.

విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు:

ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్ విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియా ద్వారా అల్-హకీమ్ షుకూర్ అనే విదేశీ హ్యాండ్లర్‌తో పరిచయం ఏర్పడిందని, అతడే తనను జిహాద్ వైపు ప్రోత్సహించాడని పేర్కొన్నాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ AQIS (అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్)తో సంబంధమున్న బీహార్‌కు చెందిన షాద్మాన్ దిల్కాష్, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగంతో కలిసి పనిచేయాలని ఆ హ్యాండ్లర్ సూచించినట్లు తెలిపాడు.

అంతేకాకుండా, 'BENX COM' అనే తీవ్రవాద గ్రూపు సభ్యులతో కూడా సంబంధాలు పెట్టుకోవాలని వీరికి సూచనలు అందినట్లు తెలిసింది. ఈ గ్రూపులోని సభ్యులు బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ ISIS (ఐసిస్)కు అనుబంధంగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి మధ్య సమాచార మార్పిడి అంతా ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు మరియు మొబైల్ నంబర్ల ద్వారా సాగుతోంది.

దేశంలో అస్థిరతను సృష్టించడానికి, యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడానికి వీరు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం పట్టుబడిన నిందితుల నుండి లభించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Next Story