దొడ్డు రకం వడ్లను కొనేందుకు తెలంగాణ సర్కార్‌కు ఇబ్బందేంటి?: కిషన్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 22 May 2024 4:26 PM ISTదొడ్డు రకం వడ్లను కొనేందుకు తెలంగాణ సర్కార్‌కు ఇబ్బందేంటి?: కిషన్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రైతులు పండించిన దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మరి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సన్న వడ్లనే కొంటామని చెబుతున్నారనీ.. వారికి వచ్చిన ఇబ్బందేంటో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు రుణమాఫీ అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తామని తాత్సారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రుణమాఫీ విషయంలో రైతులకు న్యాయం చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. డిసెంబర్ 9నే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత పంద్రాగస్టు అంటున్నారని విమర్శించారు. మరోవైపు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు. త్వరగా అమల్లోకి తీసుకురావాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సన్నరకం వడ్లనే కాదు.. దొడ్డు రకం వడ్లను కూడా రైతుల నుంచి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లే పండిస్తారనీ.. సన్నరకం వడ్లు చాలా తక్కువ మంది రైతులు పండిస్తారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులకు లబ్ధి జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కానీ.. కేంద్రం మాత్రం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. రబీ సీజన్‌లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాలని ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఇక గతంలో కూడా బీఆర్ఎస్ రైతులను మోసం చేసిందన్నారు కిషన్‌రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్ యార్డుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారనీ.. వీలైనంత త్వరగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.