రేపు తెలంగాణకు కేంద్ర బృందం

తెలంగాణకు కేంద్ర బృందం రానుంది.

By Srikanth Gundamalla  Published on  10 Sep 2024 1:17 AM GMT
రేపు తెలంగాణకు కేంద్ర బృందం

తెలంగాణకు కేంద్ర బృందం రానుంది. ఈ నెల 11వ తేదీన రాష్ట్రంలో వరదల కారణంగా మునిగిన ప్రాంతాలను పరిశీలించనుంది. ఈ మేరకు వివరాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుందని తెలిపారు. నేషనల్ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారుతో పాటు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. అలాగే మిగతా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా వారు పర్యటిస్తారని అన్నారు. ఆర్థిక , వ్యవసాయం, రోడ్లు, రహదారులు, గ్రామీణాభివృద్థి, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఉంటారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

అలాగే సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రహదారుల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రయాణికుల రాకపోకలకు కనీసం వంద అడుగుల రోడ్డు అవసరమని కిషన్‌రెడ్డి చెప్పారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, క్వాడ్రప్లింగ్‌తో పాటుగా లైన్ల విద్యుదీకరణ, 40కి పైగా స్టేషన్ల అభివృద్థి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్‌ నిర్మాణం వేగవంతంగా పూర్తవుతోందని, ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముందని లేఖలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. అలాగే వచ్చే ఏడాదికల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక వసతులతో తయారు చేస్తున్నట్లు చెప్పారు. రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచ్చి, పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయన్నారు. ట్రాఫిక్‌ సమస్యతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదనీ.. దీనిపై సీఎం చొరవతీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖలో కోరారు.

Next Story