తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చజెండా
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik
తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టుకు కేంద్ర పచ్చజెండా.. ఎక్కడో తెలుసా?
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి పలుదఫాలుగా చర్చలు జరిపి ప్రాజెక్టు పట్టాలెక్కించడంలో చొరవ చూపడంతోనే ఇవాళ అన్ని అనుమతులు మంజూరీ అయ్యాయని మంత్రి తెలిపారు.
ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. విమానశ్రయ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. మామునూరు విమానశ్రయానికి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్ పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వెల్లడించింది.
గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎన్‌వోసీ అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి NOC ఇచ్చేలా చేశారు. దీంతో HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చారు. ఇప్పుడు ఈ NOC ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి సహకారంతో.. ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.