Gadwal: జేబులో పేలిన సెల్‌ఫోన్ (వీడియో)
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 10:41 AM ISTGadwal: జేబులో పేలిన సెల్‌ఫోన్ (వీడియో)
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది. స్కూల్ పిల్లల నుంచి అందరూ సెల్‌ఫోన్లను యూజ్ చేస్తున్నారు. అయితే.. దీని వల్ల ఉపయోగాలు ఎంత ఉన్నాయో.. అనర్థాలు అంతే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సెల్‌ఫోన్లు ఉన్నట్లుండి పేలిపోయిన సంఘటనలు చాలా చూశాం. ఇలాంటి ఘటనల్లో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా గద్వాల జిల్లాలో కూడా ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. ఉన్నట్లుండి ఓ వ్యక్తి జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలిపోయింది. దాంతో.. సదురు వ్యక్తి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.
గద్వాల పుర పరిధిలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. వ్యాపారులతో మాట్లాడుతుండగా.. తన ప్యాంటు జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. వెంటనే అప్రమత్తం అయ్యి మంటలు ఎక్కువగా అంటుకోక ముందే సెల్‌ఫోన్‌ను తీసి కింద పడేశాడు. సెల్‌ఫోన్ భాగాలుగా చెల్లాచెదురుగా పడిపోయింది. ప్యాంటు జేబు సగం వరకు కాలిపోయింది. అతను ఏమాత్రం అప్రమత్తం అయ్యి ఫోన్ బయటపడేవేయకుంటే మంటలు ఎక్కువగా అంటుకుని గాయాలు ఎక్కువ అయ్యేవి. అయితే.. ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ పేలడం చూసి స్థానికులు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. దగ్గరకు వెళ్లి బాగానే ఉన్నావా అంటూ ఆరా తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెల్‌ఫోన్లు వాడేవారు తగుజాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్లు పేలడానికి ముఖ్య కారణం బ్యాటరీలే అంటున్నారు. అవి ఎక్కువగా హీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చార్జింగ్ పెట్టిన సమయంలో.. లేదంటే ఫోన్ ఎక్కువ సేపు వాడుతున్న క్రమంలో హీట్ అయ్యి పేలే అవకాశాలు ఉన్నాయి. ఇలా వేడి అయినప్పుడు చార్జింగ్ తీసివేడయం లేదంటే.. స్విచ్ఛాఫ్ చేయడం వంటికి చేసి కాసేపు అలాగే ఉంచితే మంచిదని చెబుతున్నారు. అలాగే ఫోన్‌కు ఉన్న కేస్‌ను తొలగించి ఫోన్ వేడి తగ్గేవరకు కాసేపు వాడకుండా పక్కకు పెట్టాలని అంటున్నారు.
Jio Phone Fire Telangana Gadwal district pic.twitter.com/G5nfgKN5JI
— Naru FF (@Narsimha22666) December 16, 2023