మునుగోడు ఉప ఎన్నిక గుర్తుల వివాదం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ కుమార్.. మొదటగా తనకు రోడ్ రోలర్ గుర్తును కేటాయించి ఆ తరువాత గుర్తు మార్చారని ఫిర్యాదు చేశారు. గుర్తు మార్పు విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మునుగోడు రిటర్నింగ్ అధికారి(ఆర్వో)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గుర్తు మార్పును తప్పుబట్టింది. మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని సూచించింది.
ఎందుకు గుర్తు మార్చాల్సి వచ్చిందో ఆర్వో నుంచి వివరణ తీసుకోవాలని, ఆ నివేదికను సాయంత్రం 5 గంటల లోపు పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను ఈసీఐ ఆదేశించింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో ఫారం7(ఎ) ను ఎన్నికల అధికారులు సవరించారు. శివకుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మారిన గుర్తులతో బ్యాలెట్ ముద్రణకు చర్యలు చేపట్టనున్నారు.