అమానుషం.. కులాంతర పెళ్లి చేశారని.. యువతి కుటుంబాన్ని బహిష్కరించిన కుల పెద్దలు

Caste elders ostracize the family of a young woman who married inter-caste.. An incident in Khammam district. ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. కులాంతర వివాహం

By అంజి  Published on  24 Jan 2023 8:07 AM GMT
అమానుషం.. కులాంతర పెళ్లి చేశారని.. యువతి కుటుంబాన్ని బహిష్కరించిన కుల పెద్దలు

ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో ఓ యువతి కుటుంబాన్ని కుల పెద్దలు బహిష్కరించారు. పెనుబల్లి మండలం మండాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. మండాలపాడు గ్రామానికి చెందిన పెండ్ర రాంబాబు కూతురు జీవితకు, అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు సంపత్‌లు కొన్ని రోజులుగా ప్రేమించుకున్నారు. గత సంవత్సరం మేలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్నప్పటి నుండి.. ఆ జంట హైదరాబాద్‌లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

మరోవైపు గ్రామంలో తమ కులపు అమ్మాయి.. దళిత యువకుడిని వివాహం చేసుకోవడాన్ని కులపెద్దల ఏమాత్రం సహించలేకపోయారు. పెళ్లైన నాటి నుంచి యువతి కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. కులాంతర పెళ్లి చేశారంటూ సూటి పోటీ మాటలతో వేధింపులకు గురి చేశారు. అయితే ఆ కుల పెద్దలు అక్కడితో ఆగలేదు. యువతి తండ్రి రాంబాబు, అతడి సోదరుడు గోపాల్‌రావు కుటుంబాలను కక్షపూరితంగా బహిష్కరిస్తున్నట్లు లేఖను విడుదల చేశారు. యువతి తండ్రి రాంబాబు కుటుంబాన్ని ఎవరైనా ఇంటికి పిలిచినా, వారి ఇంటికి ఎవరైనా వెళ్లినా జరిమానా విధిస్తామంటూ కుల పెద్దలు హుకుం జారీ చేశారు.

పెండ్ర రాంబాబు, గోపాలరావు కుటుంబ సభ్యుల ఇళ్లకు శుభకార్యాల నిమిత్తం కులంలోని వారు ఎవరైనా వెళ్తే రూ.2,000, వాళ్లతో మాట్లాడితే రూ.1,000, తమ కులానికి చెందిన అమ్మాయికి వేరే కులం అతనితో పెళ్లి జరిగినట్లయితే రూ.10,000, తమ కులానికి చెందిన అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రూ. 20,000 జరిమానా విధిస్తాము అన్నట్లుగా ఒక లెటర్‌ను విడుదల చేసి వాట్సాప్ గ్రూపులో పెట్టారు. తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి వాట్సాప్ గ్రూపులో ప్రచారం చేస్తున్నారని యువతి కుటుంబ మనస్థాపానికి గురైంది.

కుల పెద్దల వేధింపులు తట్టుకోలేక యువతి తండ్రి రాంబాబు, తాత గోపాల్‌రావు.. వీఎం బంజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు 13 మంది కుల పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 504, రెడ్ విత్ 34 ఐపీసీ 7(1)(బీ)(సీ) పోట్రాక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్ కింద కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమను మానసికంగా క్షోభకు గురిచేసిన వారిపై పోలీసులు, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ డిమాండ్‌ చేస్తోంది.

Next Story
Share it