Telangana: రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బుల జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 10 Jun 2024 2:30 AM GMTTelangana: రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బుల జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లోనే దాదాపు 8.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు జమ చేసినట్టు తెలిపింది. చాలా చోట్ల సేకరణ ప్రక్రియ పూర్తైందని, మరో 10 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావొచ్చని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు అవసరమైన ప్రాంతాల్లో కేంద్రాలను తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. యాసంగి సీజన్‌లో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ డబ్బులు లభించడం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయడం వల్ల అంచనా వేసిన విధంగా ధాన్యం రాలేదని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈసారి దాదాపు రెండు వారాల ముందుగా మార్చి 25 నుంచే ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ సారి వడ్లు అమ్మిన 3 రోజుల్లోనే డబ్బు ఖాతాలో వేసినట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయని తెలిపింది.