చేనేత పరిశ్రమకు జీఎస్టీ మరణ శాసనం: కేటీఆర్
Cancelled the GST on handloom products says Minister KTR. చేనేత ఉత్పత్తుల మీద వేసిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ చేనేత,
By అంజి Published on 7 Aug 2022 7:56 PM ISTచేనేత ఉత్పత్తుల మీద వేసిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీ విధించడమంటే చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాసినట్లేనని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంవత్సరం టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభపరిణామమని కేటీఆర్ అన్నారు. చేనేత మిత్ర ద్వారా 50 శాతం సబ్సిడీతో ముడి సరుకు అందిస్తున్నామని, నేతన్న బీమా ద్వారా వేల మంది నేతన్న కార్మికులకు లబ్ది చేకూరుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రమాదవశాత్తు నేత కార్మికుడు చనిపోతే 10 రోజుల్లో రూ.5 లక్షలు బీమా నామినీకి అందిస్తామన్నారు. చేనేత దుస్తులు ధరించడం వల్ల చేనేత కార్మికులకు అవకాశాలు దొరుకుతాయన్నారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలన్న మంత్రి కేటీఆర్.. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మహాత్మాగాంధీ చరకాను ఒక సింబల్‌గా తీసుకొని.. నూలును వడుకుతూ ఆ రోజుల్లో జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు మళ్లించారన్నారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున, భారత్‌లోని చేనేత కార్మికులందరి తరఫున జీఎస్టీని ఎత్తి వేయాలని కేంద్రానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ అన్నారు.