Telangana: ఆరు గ్యారెంటీల అమలుపై కేబినెట్ సబ్‌కమిటీ

ప్రజా పాలన హామీల అమలుపై కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.

By Srikanth Gundamalla  Published on  8 Jan 2024 5:45 PM IST
Cabinet Sub-Committee,  Six Guarantees, telangana,

 Telangana: ఆరు గ్యారెంటీల అమలుపై కేబినెట్ సబ్‌కమిటీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఇందు కోసమే ప్రజల నుంచి గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను కూడా స్వీకరించారు. పది రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించగా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. ప్రభుత్వం వాటిని ఇప్పుడు డేటా ఎంట్రీ చేస్తుంది. ఆ తర్వాత అర్హులను అధికారులు ఎంపిక చేయనున్నారు. కాగా.. ఆరు గ్యారెంటీల అమలుపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రజా పాలన హామీల అమలుపై కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. కేబినెట్‌ సబ్‌కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నియమించారు. ఇక కమిటీ సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.

బీఆర్ అంబేద్కర్‌ సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన దరఖాస్తులపై అధికారులతో చర్చించిన ఆయన..ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అన్ని శాఖ ఉన్నతాధికారులు, ప్రజాపాలన నోడల్ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డేటా ఎంట్రీ జనవరి చివర వరకు పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు.

ఈ విషయంపై మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 30వేల మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతోందని చెప్పారు. ఆరు గ్యారెంటీల అములకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.


Next Story