బీబీనగర్‌లో బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో గురువారం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

By అంజి
Published on : 29 Jun 2023 3:33 PM IST

Bus overturns, Yadadri Bhuvanagiri, Bibinagar

బీబీనగర్‌లో బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

హైదరాబాద్: ఇటీవల ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు బోల్తా పడుతున్న సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో గురువారం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన గూడూరు టోల్‌ప్లాజా సమీపంలో చోటుచేసుకుంది. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ మీదుగా వరంగల్ వెళ్తోంది. మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి స్థానికులు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే.. సోమవారం నాడు ప్రైవేటు బస్సు బోల్తా పడి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడిన ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చోటుచేసుకుంది. కాట్నపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

Next Story