సంక్రాంతి సందడి.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

Bus and Railway stations brim with passengers as Sankranti fervour hits Telugu states. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. పట్నం వాసులంతా పల్లెలకు బయల్దేరుతున్నారు.

By అంజి  Published on  12 Jan 2023 2:06 PM IST
సంక్రాంతి సందడి.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. పట్నం వాసులంతా పల్లెలకు బయల్దేరుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ నిర్వహించుకునేందుకు పల్లె బాట పట్టారు. జనవరి 17 వరకు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రజలు తమ స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వాహనాలు రాకపోకల కోసం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చాయి. సంక్రాంతికి జనం ఇళ్లకు వెళ్లడం ప్రారంభించడంతో బస్ స్టేషన్‌లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులతో జేబీఎస్, ఎంజీబీఎస్‌లు నిండిపోయాయి.

అయితే ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని టీఎస్‌ఆర్‌టీసీ చెబుతుండగా, బస్సులు సకాలంలో రావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. చాలా మంది తమ సొంత కార్లలో వెళుతూ టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది చేస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. మరోవైపు చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ను నివారించేందుకు అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టారు. టోల్ బూత్ లలో రెండు సెకన్లలో వాహనాలు వెళ్లేలా ఏర్పాట్లు చేయడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయి.

జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్‌ల వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైవేపై 24 గంటల పాటు గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు రైళ్ల సమయవేళలకు ముందుగానే స్టేషన్​కు చేరుకొని స్టేషన్ వద్ద పడిగాడుపులు కాస్తున్నారు. కాగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది.

Next Story