తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికలో బీసీల జనాభాను 5 శాతానికి పైగా తక్కువగా చూపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై అసెంబ్లీ, మండలిలో కాంగ్రెస్‌ను ప్రశ్నించినట్లు కేటీఆర్ చెప్పారు. బీసీల జనాభాను తక్కువ చేసి చూపించడం కారణంగా ఆ సామాజికవర్గం వారు ఆందోళనలో ఉన్నారని అన్నారు. బీసీల జనాభాపై రీ సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే తప్పు అన్నట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానిస్తుందని విమర్శించారు.
కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యను ఆహ్వానించి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చిందని, బీసీ సబ్ ప్లాన్, బడ్జెట్‌లో లక్ష కోట్లు బీసీలకు ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కేటీఆర్ అన్నారు. బీసీలకు కొత్తగా 16 కార్పొరేషన్ ఛైర్మన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారని అన్నారు. బీసీ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ అడగాలని, కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. కుంటిసాకులు వెతికి బీసీలకు అన్యాయం చేయవద్దని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ కూర్చుని ఛాయ్ తాగితే.. రాజ్యాంగ సవరణ అవుతుందని కేటీఆర్ అన్నారు.