కేంద్రంలో అధికారంలోకి వస్తేనే గ్యారెంటీలు అమలు చేస్తారట: కేటీఆర్
కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారెంటీలను అమలు చేస్తామని అంటున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 10:46 AM GMTకేంద్రంలో అధికారంలోకి వస్తేనే గ్యారెంటీలు అమలు చేస్తారట: కేటీఆర్
ఘట్కేసర్‌లో మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారెంటీలను అమలు చేస్తామని అంటున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అయితే.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదీ లేదనీ.. గ్యారెంటీలను అమలు చేసేదీ లేదంటూ కేటీఆర్ విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని చెప్పారు కేటీఆర్. ఇండియా కూటమి నుంచి ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయనీ.. వారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలనీ.. అయితే అది ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదనీ.. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్‌రెడ్డి తాకట్టు పెట్టారని కేటీఆర్ అన్నారు. అప్పులు తెచ్చుకోండి.. రూ2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పారనీ.. ఇప్పుడా హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ఆడ బిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు... ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్.
సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌పై ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్‌ను పాతిపెడతానని ప్రగల్బాలు పలుకుతున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి బుడ్డర్ ఖాన్‌లను కేసీఆర్ ఎంతోమందిని చూశారని చెప్పారు. ఎంతోమంది తీస్మార్‌ఖాన్‌లను మాయం చేసి తెలంగాణ తెచ్చారనీ.. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.