మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపొందింది.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 10:30 AM IST
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. ఇక సొంత జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. ఇక తిరిగి ఎమ్మెల్సీ స్థానాన్ని తాము నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఉమ్మడి మహబ్‌గనర్ స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత ఏడాది నవంబర్‌లో పార్టీ మారారు. ఆ తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. దాంతో.. ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికను ఎన్నికల సంఘం అధికారులు మార్చి 28న నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. కాగా.. ఈ ఉపఎన్నికకు బీజేపీ దూరంగా ఉంది. ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మొత్తం 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. కాగా.. ముందుగానే ఈ స్థానిక సంస్థల ఉపఎన్నిక ఫలితం విడుదల కావాల్సి ఉండగా.. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథయంలో వాయిదా వేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగియడంతో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలను విడుదల చేశారు ఎన్నికల సంఘం అధికారులు.