51 మందికే బీఆర్ఎస్‌ బీఫాంలు..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..!

బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ 51 మందికే బీఫాంలు అందించడంతో.. పలువురు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

By Srikanth Gundamalla  Published on  15 Oct 2023 1:55 PM IST
BRS, Telangana Elections, CM KCR, B-Forms ,

 51 మందికే బీఆర్ఎస్‌ బీఫాంలు..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..!

అందరి కంటే ముందుగానే తెలంగాణ ఎన్నికల కోసం బీఆర్ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. 115 మంది అభ్యర్థులను ప్రకటించగా అందులో ఒకరు పార్టీ మారారు. తాజాగా తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులకు బీఫామ్‌లు అందించారు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్ట్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్. 51 బీఫామ్‌లు మాత్రమే రెడీగా ఉన్నాయని.. తర్వాత మిగతావి ఇస్తామని చెప్పారు. దాంతో.. మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. దాంతో.. తొలి జాబితాలో ఉన్న అభ్యర్థుల్లో కొందరిని తప్పించే అవకాశం ఉందంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. అదీకాక బీఫామ్‌లు కూడా 51 మాత్రమే ఇవ్వడం చర్చకు మరింత బలం చేకూరుస్తోంది.

అయితే.. 51 మంది అభ్యర్థులకు తెలంగాణ భవన్‌లో బీఫామ్‌లు అందించారు సీఎం కేసీఆర్. మిగతావి సిద్ధం కాలేదని ఆయన చెప్పడంతో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తొలిజాబితా ప్రకటించి ఇప్పటికే 50 రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా బీఫామ్స్‌ సిద్ధం కాలేదనడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఎమ్మెల్యేలపై నెగెటివ్ రిపోర్టులు ఉంటే కొందరిని చివరి నిమిషంలో కూడా పక్కన పెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో.. ఇప్పుడు అదే క్రమంలో బీఫామ్‌లు ఇవ్వడం ఆపేశారని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసంతృప్తులు బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బీఫామ్స్ వస్తాయని అభ్యర్థులు అందరూ సమావేశానికి వచ్చారు. కానీ బీఫామ్స్ దక్కనివారిలో తీవ్ర ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ ప్రచారాలు అన్నింటికీ తెరపడాలంటే బీఫామ్‌లు రెడీ చేసి అందించే వరకు ఆగాల్సిందే. అప్పుడయితేనే సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులందరినీ బరిలో ఉంచుతున్నారా..? లేదంటే మార్పులు ఉన్నాయా అనేది తెలుస్తోంది. అయితే.. మిగతా వారికి కూడా పెద్దగా ఆలస్యం చేయకుండా రెండ్రోజుల్లోనే బీఫామ్‌లు అందిస్తారని తెలుస్తోంది.

Next Story