బీఆర్ఎస్ పార్టీలో విషాదం, జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 Sep 2024 6:07 AM GMTబీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమం పోరాటంలో పాలుపంచుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా జిట్టా బాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలల నుంచి అనారోగ్యంతో ఉన్న ఆయన.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇక బాలకృష్ణారెడ్డి పార్థివదేహాన్ని భువనగిరికి తరలిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన అంత్యక్రియలు భువనగిరి పట్టణ శివారులోని మగ్గంపల్లి రోడ్డులో ఫామ్‌హౌస్‌లో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు సంతాపం తెలిపారు. ఆయన అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన సమయంలో కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. బాలకృష్ణరెడ్డి అనారోగ్యంతో కన్నుమూయడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహించారు. అప్పటి టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తరుఫున పోటీ చేయాలని అనుకున్నారు. కానీ.. టికెట్ దక్కలేదు. దాంతో.. గులాబీ పార్టీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణానంతరం రాజకీయా పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. తెలంగాణకు జగన్ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న కారణంతో మళ్లీ పార్టీని వీడిన బాలకృష్ణారెడ్డి.. సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. యువ తెలంగాణ పార్టీ పెట్టారు. చివరకు రాజకీయ సమీకరణాలు మారి.. యువ తెలంగాణ పార్టీబీజేపీలో విలీనం చేసి.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. జిట్టాను బీజేపీ సస్పెండ్ చేయడంతో సొంత గూటికి బీఆర్ఎస్‌లో చేరారు జిట్టా బాలకృష్ణారెడ్డి.