నర్సాపూర్‌ BRS అభ్యర్థి ఖరారు, బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్

కొద్దిరోజులుగా పెండింగ్‌లో ఉన్న నర్సాపూర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేసింది

By Srikanth Gundamalla  Published on  25 Oct 2023 10:49 AM GMT
brs, narsapur, mla candidate, sunitha laxma reddy,

 నర్సాపూర్‌ BRS అభ్యర్థి ఖరారు, బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్

కొద్దిరోజులుగా పెండింగ్‌లో ఉన్న నర్సాపూర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేసింది. నర్సాపూర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు స్వయంగా పేరును ప్రకటించి బీఫామ్‌ అందజేశారు. కాగా.. నర్సాపూర్‌ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

అయితే.. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సాపూర్ టికెట్‌ను సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. కోర్ కమిటీ సభ్యుల నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మదన్‌ రెడ్డి బీఆర్ఎస్‌లో మొదట్నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడని సీఎం కేసీఆర్ అన్నారు. దాదాపుగా 35 ఏళ్ల నుంచి తనతో సన్నిహితంగా కొనసాగుతున్న నాయకుడని చెప్పారు. మదన్‌రెడ్డి తనకు అత్యంత ఆప్తుడు.. తన కుడిభుజం వంటి వ్యక్తి అని కేసీఆర్ అన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజస్కందాల మీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మదన్‌రెడ్డి తీసుకున్నందుకు సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కాగా.. ప్రస్తుతం కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుంచి మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక మదన్‌రెడ్డి గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. మెదక్‌ జిల్లాలో మదన్‌రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు అని చెప్పారు. వివాద రహితుడు అని.. ఆయన సేవలను పార్టీ మరింత వినియోగించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. చిన్నచిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ఉండటం ద్వారా పార్టీ ప్రతిష్టను మదన్‌రెడ్డి మరింత ఇనుమడింప చేశారని.. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్.

సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడు సార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ఆర్‌తో పాటు కొణిజెట్టి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2019లో బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా, సభ్యురాలిగా సునీతా లక్ష్మారెడ్డి పని చేశారు.

Next Story