200 యూనిట్లలోపు కరెంటు బిల్లు వస్తే చెల్లించకండి: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్‌ ఇస్తామని చెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

By Srikanth Gundamalla  Published on  9 Jan 2024 6:15 PM IST
brs, mlc kavitha, comments,  congress govt ,

200 యూనిట్లలోపు కరెంటు బిల్లు వస్తే చెల్లించకండి: ఎమ్మెల్సీ కవిత 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల టెండర్లు రద్దు చేసే ఆలోచనను కట్టుపెట్టి.. త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయనని కవిత చెప్పారు. టెండర్లను రద్దు చేసి మళ్లీ ఎందుకు టెండర్లు పిలవాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. డిజైన్‌ మార్చనప్పుడు.. ఆయకట్టు పెంచనప్పుడు ఎందుకు టెండర్లు పిలవాలనుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్‌రెడ్డి ఇటీవల చనిపోయారు. దాంతో.. అన్నసాగర్‌ గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి.. ఆల వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టు గురించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు మిగిలిన అనుమతులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు కవిత. ప్రధాని మోదీతో కేసీఆర్‌కు సత్సంబంధాలు లేవు కాబట్టి జాతీయ హోదా కేంద్రం ఇవ్వలేదనీ గతంలో రేవంత్‌ అన్నారని చెప్పారు. మరి ప్రధానితో రేవంత్‌రెడ్డి సత్సంబంధాలు పెట్టుకుని జాతీయ హోదా ఇప్పుడు తీసుకురావాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జనవరి 1న పెన్షన్లు పంపిణీ చేయాల్సింది కానీ.. ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. ఒకటి రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు ఇంకా చెల్లించలేదన్నారు. రైతుబంధు డబ్బులు పూర్తిస్థాయిలో ఎప్పుడు పంపిణీ చేస్తారని కవిత ప్రశ్నించారు. అయితే.. ప్రజాపాలన ద్వారా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయనీ చెబుతున్నారు.. కానీ వాటిని ఎందుకు తీసుకున్నారో ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్నవారి వివరాలన్నీ మీసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయనీ.. సమయాన్ని వృదా చేసుకోవడం తప్ప కాంగ్రెస్ సర్కార్‌ ఏమీ చేయడం లేదన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్‌ ఇస్తామని చెప్పారు.. కాబట్టి ఆ ప్రకారం బిల్లు వస్తే ఎవరూ చెల్లించవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story