బీజేపీలోకి మైనంపల్లి హన్మంతరావు..!
బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 12:20 PM ISTబీజేపీలోకి మైనంపల్లి హన్మంతరావు..!
బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలకు సీట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక తనకు సీటు వచ్చినా కూడా.. తన కుమారుడికి కూడా అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టి సంచలనంగా మారారు సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్‌కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. రోహిత్‌ను ఎలాగైనా మెదక్ నుంచి పోటీలో నిలబెడతానని మాటిచ్చారు కూడా. ఇక ఆయన కూడా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పారు మైనంపల్లి.
మైనంపల్లి వ్యవహారంపై పార్టీ ముఖ్యనేతలు సహా అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా మంత్రి హరీశ్‌రావు గురించి మైనంపల్లి అనుచితంగా మాట్లాడంతో వివాదం మరింత ముదురుతోంది. కొందరు నాయకులు అయితే మైనంపల్లిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించారు. ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విన్నపాలు వచ్చాయి. అయితే.. సీఎం కేసీఆర్ అప్పటికే మైనంపల్లి వ్యవహారాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. అందుకే.. మల్కాజిగిరి టికెట్ ప్రకటించిన సమయంలోనే ఇష్టమైతేనే పోటీ చేయొచ్చు.. లేదంటే మైనంపల్లి ఇష్టానికి వదిలేశారు.
ఈ పరిణామాల మధ్య మైనంపల్లి పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. పార్టీ మారి మల్కాజిగిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్‌ను పోటీలో నిలబెడతారనే వార్తలు వచ్చాయి. మైనంపల్లి ఇంటి వద్ద ఉన్న ఫ్లెక్సీలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు.. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అనుచరులు కూడా మైనంపల్లికి అండగా ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇక మరోవైపు ఆయన వికీపిడియాలో కూడా పార్టీ మారినట్లు అప్‌డేట్ చేశారు. బీజేపీలో ఉన్నట్లుగా రాసిఉంచారు. దాంతో.. మైనంపల్లి కచ్చితంగా బీజేపీలోకి చేరబోతున్నట్లు స్పష్టం అయ్యిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీజేపీలోకి మైనంపల్లి!!ఇప్పటికే మైనంపల్లి ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల తొలగింపుతాజాగా మైనంపల్లి వికీపీడియా పేజీలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లు అప్‌డేట్ pic.twitter.com/o7s4Vk4liU
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2023
ఇక బీఆర్ఎస్ ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మైనంపల్లికి మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి మరోసారి అవకాశం కల్పించింది. ఇక తాజా పరిణామాలో బీఆర్ఎస్ మార్పులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.