ఆ రెండ్రోజులు అసెంబ్లీ పెట్టొద్దంటూ స్పీకర్‌ను కోరిన మల్లారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  12 Feb 2024 6:23 PM IST
brs, mla malla reddy, request,  assembly speaker,  two days holiday,

 ఆ రెండ్రోజులు అసెంబ్లీ పెట్టొద్దంటూ స్పీకర్‌ను కోరిన మల్లారెడ్డి 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి ఆమోదించమని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగింది. అయితే.. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగుతున్న క్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్‌ ఎమ్మెల్యే నవ్వులు పూయించారు. ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు పెట్టిన విజ్ఞప్తితో అందరూ ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. సభాధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్‌ అంటూ మధ్యలో లేచారు. దాంతో.. స్పీకర్‌ కూడా మల్లారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. హాట్‌హాట్‌గా సమావేశాలు సాగుతున్న క్రమంలో ఆయన కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని భావించారు. కానీ.. మల్లారెడ్డి అలా చేయలేదు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా తెలంగాణలో సుమారు 26వేల పెళ్లిళ్లు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండ్రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి రిక్వెస్ట్‌ను విన్న స్పీకర్‌తో పాటు అటు సభ్యుల ముఖాల్లో కూడా నవ్వులు కనిపించాయి.

గతంలో కూడా మల్లారెడ్డి ఇలా తనదైన స్టైల్‌లో మాట్లాడి అందరినీ నవ్వించారు. పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా.. మంత్రినయ్యా అంటూ చెప్పిన డైలాగ్‌ చాలా ఫేమ్‌ అయ్యింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో మల్లారెడ్డి ఎక్కడ మాట్లాడినా నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి అందరికీ విభన్నంగా స్పీకర్‌కు రిక్వెస్ట్‌ పెట్టారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story