'బడ్జెట్‌లో అంకెలు తప్ప భరోసా లేదు'.. అసెంబ్లీలో హరీశ్‌ రావు ఫైర్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు తప్ప భరోసా కనిపించడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

By అంజి
Published on : 21 March 2025 11:04 AM IST

BRS MLA Harish Rao, Telangana government, Assembly

'బడ్జెట్‌లో అంకెలు తప్ప భరోసా లేదు'.. అసెంబ్లీలో హరీశ్‌ రావు ఫైర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు తప్ప భరోసా కనిపించడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌.. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ అయ్యిందన్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఏమైందని నిలదీశారు. ఇంత వరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా కిలోమీటర్‌ రోడ్డు కూడా వేయలేదన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దని అప్పుడు.. ఇప్పుడు వసూలు చేస్తున్నారని, మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎంత కాలం మహిళలను మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు.

వానాకాలం పంటకు రైతు భరోసా ఎగ్గొట్టారని, కౌలు రైతుల ప్రస్తావనే లేదని అసెంబ్లీలో హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. ఫసల్‌ బీమాకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇల్లు కడుతామని చెప్పి.. ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. దళితులు, గిరిజనులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. ఏరుదాటే దాక ఓడ మల్లన్న.. ఏరుదాటక బోడ మల్లన్న అన్నట్టు కాంగ్రెస్‌ వైఖరి ఉందన్నారు.

మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ప్రజలను ఏమారుస్తున్నారని హరీశ్‌ రావు దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు అన్ని రంగాల్లో తగ్గిపోయిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ బోగస్‌ అని, 15 నెలల అధికారంలో కాంగ్రెస్‌ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌ అరాచక పాలనతో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని కొత్త రాగం తీస్తోందని అన్నారు.

Next Story