హైడ్రా బాధితుల వేదన చూసి హరీశ్‌రావు ఎమోషనల్

హైడ్రా హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. ఇప్పటికే అక్రమంగా నిర్మించిన చాలా ఇళ్లను నేలమట్టం చేసింది.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2024 3:41 PM IST
హైడ్రా బాధితుల వేదన చూసి హరీశ్‌రావు ఎమోషనల్

హైడ్రా హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. ఇప్పటికే అక్రమంగా నిర్మించిన చాలా ఇళ్లను నేలమట్టం చేసింది. అయితే.. హైడ్రా చర్యలతో పేదలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్‌ పార్టీ హైడ్రా బాధితులకు అండగా నిలిచింది. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు హైడ్రా బాధితులు పెద్ద ఎత్తున వచ్చారు. పార్టీ నేతలు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి వారిని కలిశారు. హైడ్రా బాధితుల బాధను విన్నారు. హైడ్రా ఉన్నఫలంగా కూల్చివేసిన ఇళ్ల కోసం ఎంతో కష్టపడ్డామని బాధితులు తెలిపారు. ఇళ్లు కళ్ల ముందే కూలిపోతుంటే గుండెలు పగిలాయన్నారు. వారి పరిస్థితిని చూసిన మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఎమోషనల్ అయ్యారు. కంట కన్నీరు పెట్టుకున్నారు.

హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ లీగల్ సెల్‌ తగిన విధంగా సాయం చేస్తుందని చెప్పారు. మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. పేదల కన్నీటిపై అభివృద్ధి చేస్తారా? అని మండిపడ్డారు. సామాన్యుల ఇళ్లను కూలగొడుతున్న రేవంత్ రెడ్డి తన సోదరుడి ఇంటికి బోల్డోజర్లు పంపించగలరా? అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వస్తుందని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్‌ను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇక కూకట్‌పల్లిలో హైడ్రా భాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదన్నారు హరీశ్‌ రావు. అది రేవంత్ రెడ్డి చేసిన హత్యే అవుతుందన్నారు. . హైడ్రా ఇళ్లను కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో మహిళ బలవన్మరణం చెందిందని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి పిచ్చి నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ ఏమవుతుందో అన్న ఆందోళన ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Next Story