మంచిర్యాల: మందమర్రి వద్ద టోల్‌ప్లాజా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఘటన వైరల్‌గా మారడంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం ఆ ఆరోపణలను ఖండించారు. ప్లాజా సిబ్బందిపై తాను దాడి చేయలేదని చిన్నయ్య ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మంచిర్యాల-చంద్రాపూర్ జాతీయ రహదారి పనులు పూర్తి కాకముందే ఫీజులు వసూలు చేయడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయకుండా వాహనదారులపై పన్ను విధించినందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని తప్పుబట్టారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాజాకు 200 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తన వాహనానికి రూట్ క్లియర్ చేయనందుకు మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిని భారత రాష్ట్ర సమితి పార్టీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
సీసీటీవీ ఫుటేజీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టోల్‌ప్లాజా ఉద్యోగిని చెప్పుతో కొట్టడం, అతని అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. ఆ ఉద్యోగి తనను తాను రక్షించుకునేందుకు అక్కడి నుంచి పారిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని టోల్‌ప్లాజా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.