'ఏది అబద్ధం?'.. ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్‌ రావు

కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని హరీష్‌ రావు అన్నారు.

By అంజి  Published on  8 Aug 2024 2:40 PM IST
BRS leader Harish Rao, Telangana government, Gram Panchayats pending bills

'ఏది అబద్ధం?'.. ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్‌ రావు

కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని తాము చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని, తాము పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారని, ఉన్నమాట అంటే ఉలిక్కిపాటు ఎందుకు? అని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు ప్రశ్నించారు.

ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది అబద్దమా? కేంద్రం నుండి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించింది అబద్దమా? 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్దమా? ఏదీ అబద్ధం అని హరీష్‌ రావు నిలదీశారు.

''మాజీ సర్పంచ్ లు పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్ల లో నిర్బంధించింది అబద్దమా? గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అటకెక్కడం మేం చెప్పిన అబద్దమా? గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ రోగాలు ప్రబలడం అబద్ధమా? రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించకపోవడం అబద్ధమా? 8 నెలలుగా జడ్పిటిసిలు, ఎంపిటిసిలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం అబద్ధమా?'' అంటూ మంత్రి సీతక్కను హరీష్‌ రావు ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెలనెల 275 కోట్లు, సంవత్సరానికి 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది నిజం కాదా? అని హరీష్‌ రావు అన్నారు. ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదన్నారు. ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజమని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.

Next Story