మిడ్ డే మీల్స్ పథకం పేరుతో మోసం..బీఆర్ఎస్ నేత అరెస్ట్
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేత ఒకరు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 3:00 PM GMTమిడ్ డే మీల్స్ పథకం పేరుతో మోసం..బీఆర్ఎస్ నేత అరెస్ట్
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేత ఒకరు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అంటూ ప్రయివేట్ కంపెనీలకు ఎగనామాలు పెట్టాడు. ఆయా కంపెనీల నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడు. అయితే.. చివరకు మోసపోయామని గ్రహించిన వారు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రాజెక్టు ఇప్పిస్తానని చెప్పి ప్రయివేట్ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు బీఆర్ఎస్ నేత అలిశెట్టి అర్వింద్. ఒక బీఆర్ఎస్ ముఖ్యనేత పేరు చెప్పి మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించి ప్రాజెక్టు కచ్చితంగా ఇప్పిస్తానని బెంగళూరు చెందిన కంపెనీకి హామీ ఇచ్చాడు. అంతేకాదు.. ఆ తర్వాత నకిలీ జీవోలను కూడా సృష్టించాడు. గత ప్రభుత్వంలోని ముఖ్య నేతల సంతకాలు ఫోర్జరీ చేశాడు. నకిలీ జీవోలను చూసి నమ్మిన బెంగళూరుకు చెందిన కంపెనీ అర్వింద్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకుంది. దాదాపు రూ.5 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు. ఆర్‌టీజీఎస్ ద్వారా అర్వింద్ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులను బదిలీ చేసింది. కాగా.. చివరకు అర్వింద్ ఇచ్చినవన్నీ నకిలీ జీవోలని కంపెనీ గుర్తించింది.
తాము మోసపోయామని గ్రహించిన కంపెనీ యాజమాన్యం వెంటనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. సదురు కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారు. తాజాగా ఆ బీఆర్ఎస్ నేత అర్వింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడిని విచారిస్తున్నట్లు చెప్పారు సీసీఎస్ పోలీసులు.