డ్రగ్స్‌ కేసు.. రోహిత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీస్‌

డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం షాకాజ్ నోటీసులు జారీ చేసింది.

By -  అంజి
Published on : 17 March 2026 10:07 AM IST

Pilot Rohith Reddy, BRS Show-Cause Notice, Hyderabad Drug Party, Telangana Politics, Disciplinary Action, Drug Allegations, Former MLA Rohith Reddy

డ్రగ్స్‌ కేసు.. రోహిత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీస్‌

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని తన ఫామ్ హౌస్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం షాకాజ్ నోటీసులు జారీ చేసింది. తనపై వచ్చిన ఆరోపణలకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు భావిస్తున్న ఈ వ్యవహారంపై 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.

ఈ విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్‌ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు అందాయి. రోహిత్‌ రెడ్డి ఇచ్చే వివరణ అసంతృప్తిగా ఉంటే, పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం లేదా మరిన్ని కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీకి చెందినవారు అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్‌ వంటి వాటితో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండటాన్ని బీఆర్‌ఎస్‌ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.

హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీపై పోలీసులు దాడులు చేసినప్పుడు, అక్కడ నిషేధిత డ్రగ్స్ వినియోగం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ పార్టీలో రోహిత్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియా, మీడియాలో వార్తలు రావడంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండాలని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో, కీలక నేతలపై ఇలాంటి ఆరోపణలు రావడం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అందుకే పార్టీ నాయకత్వం ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే నోటీసులు జారీ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story