వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ జీతాలు చెల్లించాలి: హరీశ్‌రావు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  20 May 2024 12:21 PM IST
brs, harish rao,  congress govt, diagnostic centers,

 వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ జీతాలు చెల్లించాలి: హరీశ్‌రావు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందనీ.. కానీ కాంగ్రెస్‌ వచ్చాక చాలా వాటిని మూలన పడేసిందని ఆరోపించారు. మాజీమంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిందని హరీశ్‌రావు చెప్పారు. అయితే.. ఈ వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం ఈ ఐదు నెలల్లోనే కప్పకూల్చడం దారుణమని అన్నారు. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారనీ.. వాటి ద్వారా 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. వైద్య సేవల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా కేసీఆర్ నిలిపారని అన్నారు. లక్షల మంది నిరుపేద, సామాన్య ప్రజల కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా తాము చేశామని హరీశ్‌రావు చెప్పారు. నాణ్యమైన వైద్యం పరీక్షలను ఈ డయాగ్నొస్టిక్‌ కేంద్రాల ద్వారా అందించామన్నారు.

అయితే.. ఇప్పుడు నిర్వహణ లోపంతో ఈ డయాగ్నొస్టిక్‌ కేంద్రాలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. సిబ్బందికి ఏకంగా 6 నెలల నుంచి జీతాలు చెల్లించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్‌రావు విమర్శలు చేశారు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనీ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా స్పందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలను ఇవ్వాలని కోరారు. డయాగ్నొస్టిక్‌ కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలు అందే విధంగా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.



Next Story