మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే రైతు దీక్షలు: హరీశ్‌రావు
సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు.
By Srikanth Gundamalla
మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే రైతు దీక్షలు: హరీశ్‌రావు
సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నేతలతో పాటుగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు.
మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే రైతు దీక్షలు చేస్తున్నామని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారనీ.. వారి కుటుంబాలను ఏ మంత్రి కూడా పరామర్శించలేదని చెప్పారు. ఎండిన పొలాలను కూడా చూడటానికి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశార రైతులకు కష్టాలు మొదలయ్యాయని హరీశ్‌రావు అన్నారు. కరెంటు లేదు.. నీళ్లు లేవు.. కన్నీళ్లే మిగిలాయని ఆవేదన చెందారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నేతలు రాజకీయాల్లో భాగంగా తమని తిట్టండి కానీ.. రైతులను మాత్రం ఆదుకోవాలని హరీశ్‌రావు కోరారు.
రైతులకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు రూ.15వేలు, వడ్లు, మక్కలకు రూ.500 బోనస్, రైతుల కూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామని చెప్పారు. వీటిల్లో ఏదీ అమలు చేయడం లేదన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కూడా మాట తప్పిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రైతులను ఆదుకోవాలని అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పంటలు పండటం తప్ప.. ఎండటం లేదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో.. అప్పుడే కరువు వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలనీ.. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా హరీశ్‌రావు కోరారు.