ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వాలి: హరీశ్‌రావు

ఆందోళన చేస్తున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అభ్యర్థులకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  11 Jun 2024 10:26 AM GMT
brs harish rao, AEE posts appointments, telangana,

 ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వాలి: హరీశ్‌రావు 

హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద ఆందోళన చేస్తున్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అభ్యర్థులకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇప్పటిదాకా అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అపాయింట్‌మెంట్ లెటర్స్ కోసం అభ్యర్థులు ఆందోళన చేయడం ప్రభుత్వానికే సిగ్గుచేటు అన్నారు. వెంటనే అపాయింట్‌ మెంట్‌ లెటర్స్ వారికి అందించాలని మాజీమంత్రి హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి...వివిధ దశల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ పూర్తి చేసిందని చెప్పారు. కానీ.. ఇప్పటికీ నియామక పత్రాలు ఇవ్వకపోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు హరీశ్‌రావు. అభ్యర్థులు మంత్రులు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కనీసం చలనం లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని హరీశ్‌రావు ఎక్స్‌లో పేర్కొన్నారు.

డాక్యుమెంటేషన్ పూర్తి చేసి నెలలు అవుతున్నా.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో ఏఈఈ అభ్యర్థులు గాంధీభవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. గాంధీ భవన్‌ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story