తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి: మాజీమంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 May 2024 2:15 PM IST
brs, errabelli dayakar rao,  jangaon,  congress govt,

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి: మాజీమంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఎండ నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించినా కూడా పలువురు రైతులు మాత్రం నష్టపోయారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయిపోయింది. దాంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన వారిని ఆదుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇదే అంశంపై మాట్లాడారు.

ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్‌, తొర్రూరు గ్రామాల్లో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకోవడం మానేసిందని ఆరోపించారు. రైతురుణ మాఫీ రూ.లక్షలు చేస్తామని అన్నారంటూ గుర్తు చేశారు. ఇంకెప్పుడు రుణమాఫీ అమలు చేస్తారని ప్రశ్నించారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో పలు చోట్ల ధాన్యం రైతులు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని తామే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించాలన్నారు. రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. రైతులను పట్టించుకోకపోతే అన్నదాతలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Next Story