దయచేసి ఆస్పత్రికి రాకండి.. BRS కేడర్‌కు కేసీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో ఇటీవల కిందపడి గాయపడ్డ విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  12 Dec 2023 5:15 PM IST
brs chief, kcr, request, party cadre,

దయచేసి ఆస్పత్రికి రాకండి.. BRS కేడర్‌కు కేసీఆర్ విజ్ఞప్తి  

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో ఇటీవల కిందపడి గాయపడ్డ విషయం తెలిసిందే. ఆయన కాలుకి సర్జరీ కూడా జరిగింది. ఆయనకు పూర్తిగా కోలుకుని ఎప్పటిలా నడిచేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని యశోద ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఆయన ప్రస్తుతం యశోద ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దాంతో.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్తున్నారు.

అయితే.. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను చూసేందుకు బీఆర్ఎస్ కేడర్, అభిమానులు అక్కడికి భారీగా వెళ్లారు. సోమవారం అక్కడికి పెద్ద ఎత్తున వెళ్లిన పార్టీ శ్రేణులు, అభిమానులు కేసీఆర్‌ను చూసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వైద్యులు, సెక్యూరిటీ కుదరదని చెప్పడంతో నినాదాలు చేశారు. భద్రతా కారణాలు చెప్పినా వినకుండా కేసీఆర్.. బీఆర్ఎస్‌.. కేటీఆర్‌ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పేలా చేశారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. దాంతో.. స్వయంగా మాజీమంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆస్పత్రి బయటకు వచ్చి కేడర్‌ను సముదాయించి కాస్త శాంపరిచారు.

ఈ విషయం కేసీఆర్‌ వరకు చేరింది. ఆస్పత్రికి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున రావడంపై కేసీఆర్ వీడియో చేశారు. వారిని ఉద్దేశిస్తూ విజ్ఞప్తి చేశారు. తాను కోలుకుంటున్నాననీ.. త్వరలోనే మీ ముందుకు వస్తానని కేసీఆర్ అన్నారు. దయచేసి ఆస్పత్రి వద్దకు ఎవరూ రావొద్దని కోరారు. తనతో పాటు ఆస్పత్రిలో వందలాది మంది పేషెంట్లు ఉన్నారనీ.. వారికి ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. దయచేసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. పూర్తిగా కోలుకుని బయటకు వచ్చాక తప్పకుండా కలుస్తానని మాట ఇచ్చారు. తన పట్ల అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.


Next Story