కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. అందెవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన వంతెన కుప్పకూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోవడంతో కాగజ్‌నగర్, దహేగం మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఫలితంగా 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గత కొద్ది రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్దవాగులో వరద ప్రవాహం పెరిగింది. పలితంగా బ్రిడ్జి కుంగిపోయింది. వంతెన ప్రమాదకరమైన స్థితికి చేరడంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామున అప్రోచ్ రోడ్డు నుంచి 3వ పిల్లర్ వరకు బ్రిడ్జి కూలిపోయింది. వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కూలిన బ్రిడ్జిని తొలగించి, ఆస్థానంలో నూతన కొత్త వంతెన నిర్మించి సాధ్యమైనంత త్వరగా రాకపోకలను పునరుద్దరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.