తెలంగాణలో మొదలైన బోనాల సందడి

తెలంగాణలో జరుపుకునే అనేక పండుగల్లో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సాంప్రదాయ హిందూ పండుగను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2023 10:56 AM GMT
Bonalu Jatara, Telangana state festival, Golconda Bonalu

తెలంగాణలో మొదలైన బోనాల సందడి

తెలంగాణలో జరుపుకునే అనేక పండుగల్లో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సాంప్రదాయ హిందూ పండుగను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.

తెలంగాణ ఆవిర్భావ సమయంలో మహిళలు ఏకం కావడానికి, తెలంగాణ సంస్కృతిలో భాగం కావడానికి ఈ పండుగ దోహదపడింది. ఆ తర్వాత, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని 225 దేవాలయాలలో బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగగా మారాయి. బోనాల సమయంలో చేసే పూజలు, ఆచరించే పనులు దుష్టశక్తులను పోగొట్టి సమాజానికి శ్రేయస్సుని కలిగిస్తాయని నమ్ముతారు. కుల, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అతీతంగా ప్రజలు ఏకమవ్వడానికి, దేవుళ్ళ పట్ల తమ భక్తిని చాటుకోవడానికి బోనాలు ఓ వేదికగా మారాయి. హైదరాబాద్‌లోని బోనాలు ఆషాఢం నెలలో ఆదివారాల్లో ఉత్సాహంగా చేసుకుంటారు. జులై, ఆగష్టు నెలల్లో నిర్వహిస్తారు.

గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం, ఉజ్జయిని మహంకాళి ఆలయం, గండిమైసమ్మ దేవాలయం వంటి ఇతర ప్రముఖ ఆలయాలతో సహా నగరంలోని వివిధ ఆలయాలకు భక్తులు బోనాల సమయంలో పోటెత్తుతారు. బోయినపల్లి నివాసి టి మాలతి మాట్లాడుతూ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. “మేము పొద్దున్నే లేచి, బోనం సిద్ధం చేస్తాము, కుండలను అలంకరిస్తాము. సాంప్రదాయ దుస్తులు ధరిస్తాము. మా తలపై బోనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి, లయబద్ధమైన దరువులకు ఆనందంగా నృత్యం చేస్తూ ఆలయానికి వెళ్తాము." అని మాలతి చెప్పుకొచ్చారు. ప్రజలు ఆరాధించే దేవత ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి బోనాలు మోసే మహిళల పాదాలకు నీరు పోయడం వంటి ఆచారాలు ఈ పండుగలో భాగం. సికింద్రాబాద్‌లోని లష్కర్ ప్రాంతంలో, బోనాల వేడుకలు ఎదురుకోలుతో ప్రారంభమవుతాయి, ఇది అమ్మవారి గృహప్రవేశానికి ప్రతీక, తరువాత బోనాల జాతర, ఇతర ఆచారాలు పాటిస్తారు.

గన్‌ఫౌండ్రి ముత్యాలమ్మ ఆలయంలో, రెండు శతాబ్దాల నాటి సంప్రదాయాలని పాటిస్తారు. ఉత్సవాలలో భాగంగా రెండు రోజుల పాటు ఊరేగింపులు, వివిధ కార్యక్రమాలు చేపడతారు. ఈ ఘట్టం ఊరేగింపుతో ముగుస్తుంది. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకలమ్మ వంటి ఊరి దేవతల ఆరాధన ఉంటుంది.

చరిత్ర

బోనాలు హిందూ దేవత మహంకాళి అమ్మవారికి అంకితం. స్త్రీ శక్తి ఉగ్రరూపమే మహంకాళి. ఈ పండుగ సాధారణంగా జూలై మరియు ఆగస్టు నెలల్లో వస్తుంది. వరుసగా నాలుగు ఆదివారాల్లో ఉంటుంది. ఈ పండుగ 19వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం కాలంలో ఉద్భవించిందని భావిస్తున్నారు. అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఎంతో మంది ప్రాణాలను తీసింది. దీంతో ప్రజలు మహంకాళి ఆశీర్వాదం కోసం, భూమిని వ్యాధి నుండి విముక్తి చేయమని వేడుకున్నారు. అద్భుతంగా, అంటువ్యాధి చివరికి తగ్గిపోయింది. అప్పటి నుండి బోనాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేసిన తన పరిశోధనలో మాత్రం సింధు లోయ నాగరికత నాటి నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నట్లు తెలిపారు.

బోనాలు మన సంప్రదాయం, విశ్వాసాలలో లోతుగా పాతుకుపోయినప్పటికీ, పండుగకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. బోనాలను సాధారణంగా వర్షాకాలంలో నిర్వహిస్తారు. ఆ సమయంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. బోనాలు అనే తెలుగు పదం "భోజనం" నుండి దాని పేరు వచ్చింది, ఇది దేవతకు పెట్టే భోజనం అని సూచిస్తుంది. వండిన అన్నం, బెల్లం, పెరుగు, పసుపు కలిపిన బోనం నైవేద్యం గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. పసుపు, బోనంలో కీలకమైన పదార్ధం, అది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలకు ప్రసిద్ధి చెందింది.

“జీహెచ్‌ఎంసీ పరిశుభ్రతను నిర్ధారించడానికి నగరంలో ఎలా క్లోరినేషన్ చేస్తుందో అదే విధంగా బోనం కూడా. బోనాల సమయంలో పసుపుతో నింపిన పోతురాజు కొరడా శక్తివంతమైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది ”అని హరికృష్ణ చెప్పారు.

పోతురాజు

బోనాలలో అత్యంత ఆకర్షణీయమైన అంశం పోతురాజు కూడా. “పోతురాజు ఏడుగురు సోదరీమణులకు (ఏడుగురు దేవతలు) ఏకైక సోదరుడు. వారి నమ్మకమైన సహాయకుడు అలాగే రక్షకుడు. అతన్ని ఒక భయంకరమైన యోధునిగా చిత్రీకరించారు, సంప్రదాయ వస్త్రధారణ, విస్తృతమైన ఆభరణాలు, ఎత్తైన శిరస్త్రాణంతో అలంకరించి ఉంటారు. పోతురాజు పాత్ర మహంకాళి ఆత్మను మూర్తీభవిస్తూ ఓ మాయలో నృత్యం చేయడం. అతను దైవిక శక్తిని కలిగి ఉంటాడని.. పండుగ సమయంలో భక్తులను రక్షిస్తాడని నమ్ముతారు." అని హరికృష్ణ తెలిపారు.

పోతురాజు నృత్యం

పోతురాజు నృత్యం చూపరులను కట్టిపడేసే అద్భుత దృశ్యం. అతని కదలికలు, నాట్యం ఆ ప్రాంతంలో ఓ మంచి వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాంప్రదాయ సంగీతానికి పోతురాజు నాట్యం బోనాలకు ఓ కొత్త వాతావరణాన్ని తీసుకుని వస్తుంది. పోతురాజు నృత్యం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆధ్యాత్మికతను తీసుకుని వస్తుంది.

సాంస్కృతికంగా మరో ముందడుగు:

ఒకప్పుడు స్థానికంగా జరిగే పండుగ బోనాలు కాస్తా ఇప్పుడు తెలంగాణ సరిహద్దులు దాటి గుర్తింపు, ఆదరణ పొందాయి. ఇటీవలి సంవత్సరాలలో, ఈ పండుగ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల నుండి దృష్టిని ఆకర్షించింది. ఈ ఉత్సవాలు బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలతో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఆయా ప్రాంతాలలో తెలుగు వారు ఉత్సాహంగా బోనాలు జరుపుకుంటారు. ఇది సాంస్కృతికంగా మరో ముందడుగు వేసినట్లేనని ఎంతో మంది చెబుతూ ఉంటారు.

Next Story