బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన భోగ శ్రావణి
జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 23 Feb 2023 8:15 PM ISTబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన భోగ శ్రావణి
జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గురువారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడారు. కరోనా వైరస్ వంటి కష్టాలలోనూ ప్రజల మధ్య ఉండి పార్టీ కోసం పనిచేశానని ఆమె అన్నారు. తన భర్త ప్రవీణ్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు గతంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారని, పార్టీని నమ్ముకున్న తనకు నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
''చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాయకత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, కనీసం ఏం జరిగిందో ఆరా తీయలేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వార్డ్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నాను'' అని శ్రావణి అన్నారు. తాను ప్రజల ఓట్లతో గెలిచానని, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఇచ్చిన బీ ఫాం వల్ల కాదని శ్రావణి అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో పార్టీలో చేరానని, ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కవిత అనుచరులను పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని, ఇన్ని రోజులు తనకు సహకరించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ స్వార్ధపూరిత కుట్రలకు బీసీ మహిళ బలైందని.. అందుకే ఆత్మాభిమానం కోసమే మున్సిపల్ పదవికి రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల పక్షాన నిలబడతానని అన్నారు. అన్ని పార్టీలు తనను ఆహ్వానించాయని, భవిష్యత్ రాజకీయాలను కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని శ్రావణి స్పష్టం చేశారు.