హైడ్రా పేరుతో దౌర్జన్యం.. బాధితులకు అండగా ఉంటాం: ఈటల
తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 5:21 PM ISTతెలంగాణ వ్యాప్తంగా హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైడ్రా కూల్చివేతల్లో పేదల ఇళ్లు ఉన్నాయనీ.. వారు ఎందుకు నష్టపోవాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. అయితే.. సామాన్యులు నష్టపోతున్నారనీ.. తాము బాధితులకు అండగా ఉంటామన్నారు. అవసరమైతే లక్షమందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా కోరారు.
చైతన్యపురి డివిజన్ న్యూమారుతీ నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఈటల రాజేందర్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉన్నది ప్రభుత్వ భూమి కాదన్నారు. ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. పేదలపై కనికరం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. మూసీని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదని, కానీ ఎన్నడో భూమి కొన్నవారు ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నారని చెప్పారు. అలాంటి వారికి నష్టం జరగకుండా అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ సూచించారు.