హైదరాబాద్: డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్‌కు సిద్ధమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి డ్రగ్ టెస్ట్ చేయిస్తానని గతంలో కేటీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడిన ఆయన.. నీ గోళ్లు, జుట్టు, కిడ్నీ ఎవరికి అవసరం అని, కేటీఆర్‌కు మధుమేహం ఉందని, మీ డయాబెటిక్ కిడ్నీ ఎవరికి అవసరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. బండి సంజయ్ తంబాకు నములుతాడంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను అరవింద్ తప్పుబట్టారు. లవంగాకు, తంబాకుకు తేడా తెలియని మనిషి కేటీఆర్ అని మండిపడ్డారు. బండి సంజయ్‌కు సవాల్ చేసే ముందు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ తన పేరును డ్రగ్స్ కుంభకోణాల్లోకి లాగారని నిన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ పరీక్షకు శాంపిల్స్ అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి.. డ్రగ్ టెస్ట్ కోసం తన రక్తం, చర్మం, గోళ్లు, వెంట్రుకల నమూనాలతో పాటు కిడ్నీని కూడా అందజేస్తానని చెప్పారు. మంత్రి సవాల్ విసురుతూ, తాను డ్రగ్స్ తీసుకోలేదని నిరూపణ అయితే.. బండి సంజయ్ కరీంనగర్ కమాన్‌లో తన సొంత పాదరక్షలతో చెంపదెబ్బ కొట్టుకోవాలని అన్నారు.