రెండ్రోజుల్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. రెండ్రోజుల్లోనే తొలి జాబితా వస్తుందన్నారు..
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 10:28 AM GMTరెండ్రోజుల్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల కోసం ఎప్పుడో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ కూడా తొలి జాబితా విడుదల చేసింది. అయితే.. బీజేపీ మాత్రమే ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అన్ని చూసుకుని మంచి పోటీ ఇచ్చే అభ్యర్థులను నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. మరో రెండ్రోజుల్లోనే తొలి జాబితా ఉంటుందని వెల్లడించారు.
శుక్రవారం న్యూఢిల్లీలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే అభ్యర్తులకే టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ దిశగానే పార్టీ నాయకత్వం కసరత్తులు చేస్తోందని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. అయితే.. తొలి జాబితాను మరో రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తమ జాబితాలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తామని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఓట్ల కోసమే బీసీలను ఉపయోగించుకుంటున్నారంటూ విమర్శలు చేశారు ఎంపీ లక్ష్మణ్. ఈ రెండు పార్టీలు బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే తామే ఎక్కువ కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.
అయితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిపి పనిచేస్తున్నాయని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను లక్ష్మణ్ తప్పబట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నటికీ కలిసి పనిచేయవు అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికతో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీలో జాతీయ నాయకత్వంతో సమావేశాలు జరుగుతున్నాయని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. కాగా.. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ క్రమంలో ఎవరికి టికెట్లు లభిస్తాయో అని ఉత్కంఠ నెలకొంది.