కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రాముల‌మ్మ‌.. అలా చేస్తే స‌రిపోతుందా.?

BJP Leader Vijayashanti Fires On KCR. బీజేపీ నేత విజ‌య‌శాంతి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మ‌రోమారు నిప్పులు చెరిగారు.

By Medi Samrat  Published on  1 March 2021 4:02 AM GMT
Vijayashanti  fires on KCR

బీజేపీ నేత విజ‌య‌శాంతి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మ‌రోమారు నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ హత్యల పాపాన్ని కౌన్సిల్ బీ ఫారంతో కడిగేసుకుందామన్న కుట్ర చెల్లుతుందా? అని ప్ర‌శ్నించారు. వామనరావు దంపతులపై బ్రహ్మ హత్యా పాతకానికి పాల్పడి.. వాణీ దేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ప్రాయశ్చిత్తం అవుతుందా?.. అని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ చర్యలను ఆవేదనతో రగిలిపోతున్న బ్రాహ్మణులు అంతర్గత సమావేశాలలో ఆత్మసాక్షిగా ప్రశ్నించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోందని ఆమె రాసుకొచ్చారు. మంథనిలో చేసిన పాపానికి మల్కాజిగిరితో పాటు మూడు ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ ఓటర్లతో ప్రక్షాళన చేసుకోవాలని సీఎం చేస్తున్న కపట ప్రయత్నాలను.. అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో బ్రాహ్మణ సామాజిక వర్గం లేదని ఆమె అన్నారు.

బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకు మాజీ ప్ర‌ధాని పీవీ బిడ్డ వాణీదేవిని బరిలోకి దించిన కేసీఆర్.. వామనరావు దంపతుల హత్యకు కారకులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. చెబితే తప్పా.. ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదన్న స్పష్టమైన వైఖరితో బ్రాహ్మణ సమాజం ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

పీవీ కుమార్తెకు టెకెట్ కేటాయించానని ప్రచారం చేసుకుంటున్న గులాబీ బాస్.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామచందర్ రావుకు పడే బ్రాహ్మణ ఓట్లను చీల్చడానికి కుట్ర చేస్తున్నరనేది వాస్తవమన్నది మొత్తం తెలంగాణ సమాజం అభిప్రాయమ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.
Next Story