జితేందర్‌రెడ్డి ట్వీట్‌కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్‌

జితేందర్‌రెడ్డి ట్వీట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు.

By Srikanth Gundamalla
Published on : 30 Jun 2023 3:33 PM IST

Etela Rajender, Counter, Jithender Reddy Tweet, BJP

జితేందర్‌రెడ్డి ట్వీట్‌కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్‌ 

తెలంగాణ బీజేపీలో వివాదాలు ముదురుతున్నాయి. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పెట్టిన ట్వీట్‌ కమలం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి దున్నపోతులను ట్రాలీలోకి ఎక్కిస్తూ.. ముందుకు కదలని ఒక దున్నపోతుని కాలితో తంతాడు. ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ ఈ ట్రీట్‌మెంట్‌కే పార్టీ నాయకత్వానికి కావాలంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో.. బీజేపీలో ముసలం ఏ రేంజ్‌లో ఉందో అందరికీ అర్థమైందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జితేందర్‌రెడ్డి ట్వీట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. జితేందర్‌రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆ ట్వీట్‌ ఎందుకు చేశారో.. ఆయన ఉద్దేశం ఏంటనేది ఆయనకే తెలియాలని ఈటల రాజేందర్ అన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్పారు. అలా మాట్లాడి పార్టీ పరువు తీయొద్దని చెప్పారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత సీనియర్ నాయకులపై ఉందని గర్తు చేశారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవం తగ్గించొద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

ఈటల రాజేందర్‌ ఒక్కరే కాదు.. జితేందర్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ చాలా మంది నాయకులు ఆయనపై ఆగ్రహంగానే ఉన్నారు. ఉన్నట్లుండి పార్టీ నాయకత్వాన్నే విమర్శించేలా ట్వీట్‌ చేయడం సరికాదని చెబుతున్నారు. ఆ వీడియోను డిలీట్ చేసి మళ్లీ పోస్టు చేశారు జితేందర్‌రెడ్డి. మరి మున్ముందు తెలంగాణ బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది చూడాలి.

Next Story