హైదరాబాద్: రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ను బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, రాష్ట్ర శాఖ నాయకుడు ఎన్ రాంచందర్ రావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. మహేష్ భగవత్ కొనసాగింపు ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తెలంగాణ బీజేపీ పేర్కొంది. మహేశ్ భగవత్ 2016 నుంచి పోలీస్ కమిషనర్ (రాచకొండ)గా పనిచేస్తున్నారు. సీపీ భగవత్ 3 సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది.
మునుగోడు ఉపఎన్నికకు ముందు రాచకొండ సీపీపై ఫిర్యాదు చేయడం ఆసక్తిని రేపుతోంది. గత నాలుగేళ్ల నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉన్నారని వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని నేతలు కోరారు. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒక అధికారి గత 4 సంవత్సరాలలో 3-సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే లేదా ఆరవ నెల చివరి రోజున లేదా అంతకు ముందు 3-సంవత్సరాలు పూర్తి చేసుకుంటే, అటువంటి అధికారులను బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ రాష్ట్ర విషయంపై వెంటనే చర్య తీసుకోవాలని బిజెపి అభ్యర్థించింది.