జైలుకు బిగ్‌బాస్-7 విన్నర్ రైతుబిడ్డ ప్రశాంత్
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్‌బాస్ - 7 విన్నర్ ప్రశాంత్‌కు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
By అంజి Published on 21 Dec 2023 8:10 AM ISTజైలుకు బిగ్‌బాస్-7 విన్నర్ రైతుబిడ్డ ప్రశాంత్
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్‌బాస్ - 7 విన్నర్ ప్రశాంత్‌కు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నిన్న రాత్రి ప్రశాంత్‌తో పాటు అతడి సోదరుడు రాజుని అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కాసేపు విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంతో ప్రశాంత్, రాజును హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు తరలించారు. త్వరలోనే కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు.
అంతకుముందు బిగ్‌బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో మండలం కొల్గూరులో ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బిగ్‌బాస్ 7 ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్ చేసిన వీరంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్‌ను, అతని తమ్ముడు మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై పోలీసులు మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన ఘటనపై పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌తో పాటు పలువురిపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రశాంత్ కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను అరెస్టు చేశామని అన్నారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీరాన్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రశాంత్ ను మెజిస్టేట్ ముందు హాజరుపర్చగా.. 14రోజులు రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు.