కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్.. లిక్కర్ స్కామ్ కేసు నుండి డిశ్చార్జ్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న న్యాయపోరాటంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.

By -  అంజి
Published on : 27 Feb 2026 11:48 AM IST

MLC Kavitha Discharged, Delhi Liquor Scam Verdict, Clean Chit for Kavitha, Magunta Raghava Reddy Acquittal, Rouse Avenue Court Order

కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్.. లిక్కర్ స్కామ్ కేసు నుండి డిశ్చార్జ్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న న్యాయపోరాటంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన ఈ కేసులో కవితపై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు లేవని భావిస్తూ, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను ఈ కేసు నుండి డిశ్చార్జ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కవిత దాదాపు 166 రోజుల పాటు తీహార్ జైలులో రిమాండ్ అనుభవించారు. ఈ క్రమంలో ఆమె పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, విచారణ కొనసాగుతున్నందున జాప్యం జరిగింది. తాజా తీర్పుతో ఆమెకు పూర్తి స్థాయిలో 'క్లీన్ చిట్' లభించినట్లయింది.

ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని కూడా కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఆయనకు వ్యతిరేకంగా కూడా సరైన సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విడుదల చేసిన తరుణంలోనే, ప్రాసిక్యూషన్ వాదనల్లో బలం లేదని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఊహాగానాలు లేదా ఎవరో ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా క్రిమినల్ కుట్రను నిర్ధారించలేమని కోర్టు తేల్చిచెప్పింది. తెలంగాణ ఎన్నికల తర్వాత కవిత అరెస్ట్ కావడం, ఆపై సుదీర్ఘ కాలం జైల్లో ఉండటం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బగా మారింది.

ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మోపిన అభియోగాలను నిరూపించడంలో సిబిఐ విఫలమైందని పేర్కొంటూ కోర్టు వారిని ఈ కేసు నుండి విముక్తి చేసింది. కేజ్రీవాల్‌పై సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు వాటికి మద్దతుగా ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని, ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని ప్రధాన కుట్రదారుడిగా చిత్రీకరించడం సమర్థనీయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

సరైన ఆధారాలు లేకుండా ప్రాసిక్యూషన్ ఆరోపణలు చేయడం వల్ల వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతింటుందని కోర్టు అభిప్రాయపడింది. మనీష్ సిసోడియాను విడుదల చేస్తూ, ప్రాసిక్యూషన్ వాదనలు న్యాయపరమైన పరిశీలనలో నిలబడలేదని కోర్టు పేర్కొంది. సిసోడియా వైపు నుండి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది.

Next Story