Telangana: సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్.. ఆపై 'భూధార్' కార్డు జారీ
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు, వివాదాలకు తావులేకుండా చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'భూ భారతి' పోర్టల్‌ను...
By - అంజి |
Telangana: సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్.. ఆపై 'భూధార్' కార్డు జారీ
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు, వివాదాలకు తావులేకుండా చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'భూ భారతి' పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి, రికార్డుల్లోని సమాచారానికి కచ్చితంగా సరిపోలితేనే ఇకపై రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. గతంలో అమల్లో ఉన్న ధరణి పోర్టల్‌లో నెలకొన్న లోపాలను సవరించి, సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోని ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు.
భూ భారతి విధానంలో సాగు భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే సర్వే తప్పనిసరి చేశారు. రైతులు ముందుగా ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వేయర్ పొరుగు రైతులకు నోటీసులు ఇచ్చి, అందరి సమక్షంలో సరిహద్దులు నిర్ణయించి తహసీల్దార్‌కు నివేదిక ఇస్తారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణం ఆధారంగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రైతులకు పట్టా పాసుపుస్తకంతో పాటు విశిష్ట సంఖ్య కలిగిన 'భూధార్' కార్డును జారీ చేస్తారు. ఈ కార్డులో భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు ఉండటమే కాకుండా, భవిష్యత్తులో సర్వే సంఖ్యలు లేదా విస్తీర్ణం మార్చడానికి వీలుండదు.
ఈ నూతన పోర్టల్ ద్వారా ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పడనుంది. రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రభుత్వ భూముల ఉనికి స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాకుండా, రైతులు నేరుగా పోర్టల్‌లోనే భూ నక్షా (మ్యాప్), మార్కెట్ విలువ వంటి వివరాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. తద్వారా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, పకడ్బందీగా భూముల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది.