జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే వేధింపుల వల్లే అంటూ..
Bhoga Sravani has resigned from the post of Jagityala Municipal Chairperson. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి భోగ శ్రావణి అనూహ్యంగా ఇవాళ మధ్యాహ్నం
By అంజి Published on 25 Jan 2023 5:02 PM ISTజగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి భోగ శ్రావణి అనూహ్యంగా ఇవాళ మధ్యాహ్నం రాజీనామా చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన రాజీనామా ప్రకటన చేశారు. రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపారు. గత మూడేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే వేధింపుల కారణంగా కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని చెబుతూ.. శ్రావణి మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. ''దొర.. నేను నీ గడిలోంచి ఈ రోజు బయటపడుతున్నాను. నా రాజీనామా పత్రం మీకు అందజేస్తున్నాను. అణచివేతకు గురైన బహుజన వర్గాలకు చెందిన బీసీ మహిళగా నా చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొర. డాక్టర్ సంజయ్ కుమార్ దొర మీకు దండం'' అంటూ శ్రావణి కంటతడి పెట్టుకున్నారు.
తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని భోగ శ్రావణి ఎస్పీని కోరారు. తన కుటుంబాన్ని ఎమ్మెల్యే బెదిరించారని ఆమె ఆరోపించారు. తన ఆరోపణలు అబద్ధం నిరూపించాలనుకుంటే.. ఎమ్మెల్యే తన మనవరాలి మీద ప్రమాణం చేయాలన్నారు. ఇన్ని రోజులుగా ఎంతో నరకవేధన అనుభవించానని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని, విధులు నిర్వర్తించానని శ్రావణి పేర్కొన్నారు. బీసీ బిడ్డ ఎదుగుతోందని ఓర్వలేకే తనపై ఎమ్మెల్యే కక్ష కట్టారని ఆరోపించారు. పేరుకే తాను చైర్ పర్సన్ అని.. పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి దక్కేందుకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కె.కవిత, మంత్రి కేటీఆర్‌కు శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు.
జగిత్యాల బీఆర్ఎస్లో ముసలం
గత కొంత కాలంగా జగిత్యాల బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. శ్రావణి ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా శ్రావణికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కొందరు కౌన్సిలర్లు.. నిన్నటి వరకు అవిశ్వాస తీర్మానం పెడతామని బెదిరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖ కూడా ఇచ్చారు. వీరి వెనక వైఎస్ చైర్ పర్సన్ హస్తం ఉందని ప్రచారం కూడా సాగుతోంది. జగిత్యాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతున్న వేళ.. కారులో చీలికలు రావడం పార్టీని నష్టపరిచే విధంగా ఉంది. పార్టీలో పలు వర్గాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని.. స్థానిక నాయకులు, కార్యకర్తలు గుస గుసలాడుకుంటున్నారు.