పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేస్తున్న సైకిల్ యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. భట్టి విక్రమార్క చేస్తున్న సైకిల్ యాత్రకు మధ్యతరగతి ప్రజలు, మహిళలు, చిరు వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పాల్వంచ నుంచి మొదలైన భట్టి రెండోరోజు సైకిల్ యాత్ర లక్ష్మీదేవిపల్లి వద్దకు చేరుకునిసరికి.. ఒక్కసారిగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి భట్టికి తమ బాధలు వెళ్లబోసుకున్నారు. పెరిగిన ధరలతో పడుతున్న ఇబ్బందులు, కష్టాలను మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
మధ్యతరగతి, సాధారణ కూలీ మహిళలు చెప్పిన బాధలు విన్న భట్టి విక్రమార్క ధరలపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రేట్లు పెంచుకుంటూ సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని ఆగ్రహంగా అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదలతో రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా బాగా మండిపోతున్నాయని అన్నారు. మహిళలు, యువత అందరూ కలిసి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క పిలునిచ్చారు.