ఆదర్శంగా నిలుస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్
Bhadradri Kothagudem Collector wife delivery in government hospital.ప్రభుత్వ ఆస్పత్రులంటే చాలా మందికి చిన్న చూపు.
By తోట వంశీ కుమార్ Published on 10 Nov 2021 9:45 AM ISTప్రభుత్వ ఆస్పత్రులంటే చాలా మందికి చిన్న చూపు. అక్కడ వైద్యం చేయించుకునేందుకు వెనకడుగు వేస్తుంటారు. సరైన వైద్య పరికరాలు అందుబాటులో ఉండవనో, వైద్యులు బాధ్యతగా ఉండరనో కారణాలు ఏవైనప్పటికి ప్రభుత్వాసుపత్రులు అంటేనే కొందరు భయపడుతుంటారు. ఖర్చులు ఎక్కువైనా సరే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకే మొగ్గు చూపుతుంటారు. అయితే.. అవన్నీ ఉత్త మాటలే అని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయంటూ ప్రజలకు నమ్మకం కలిగేందుకు పలువురు రాజకీయ నాయకులతో పాటు అధికారులు చెబుతుంటారు. అయితే.. చెప్పడమయితే చెబుతారు కానీ.. వారు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్లడం చూస్తుంటాం. కాగా..తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ తన భార్యకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి ప్రసవం కోసం మంగళవారం రాత్రి భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. డీసీహెచ్ఎస్ డాం.ఎం.ముక్కంటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్లు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. రాత్రి ఒంటి గంట సమయంలో సిజేరియన్ చేశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశంతోనే కలెక్టర్ తన భార్యను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల 21న ఆడబిడ్డకు జన్మనిచ్చారు.