భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (52) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 10:42 AM ISTభద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (52) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భద్రాచలంలోని తన నివాసంలో కుంజా సత్యవతికి ఛాతీలో తీవ్ర నొప్పి వచ్చింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. భద్రాచలం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కుంజా సత్యవతి మృతిపట్ల పలువురు నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమెకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సీపీఎం పార్టీ ద్వారా కుంజా సత్యవతి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1991లో ఆ పార్టీ ద్వారా ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ చొరవతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సత్యవతి.. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ సొంత గూటికే చేరినప్పటికీ... రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కుంజా సత్యవతి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ.. ఇంతలోనే ఆమెను కన్నుమూయడంతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.
సత్యవతి భౌతిక కాయాయానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నివాళులర్పించారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, డీకే అరుణం సంతాపం తెలిపారు. 2009 నుంచి 2014 వరకు అసెంబ్లీలో అనేక అంశాలను లేవనెత్తి జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తుమ్మల అన్నారు. పేదలు, గిరిజనుల అభ్యన్నతికి కుంజా సత్యవతి ఎంతో కృషి చేశారని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు.